మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో కడప జైలులో నలుగురు, విశాఖ జైలులో ఒకరు శిక్ష అనుభవిస్తున్నారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు, విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న టీడీపీ నేత పరిటాల రవి హత్య జరిగింది. జిల్లాలో కార్యకర్తల సమావేశంలో పరిటాల రవిపై మొద్దు శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి కాల్పులు జరిపారు. ఓబి రెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు టీడీపీ పార్టీ కార్యాలయం బయట బాంబులు వేసి కార్యకర్తలను భయభ్రాంతులను చేశారు. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా అందులో నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఏ1 మొద్దు శీను, ఏ2 మద్దెలచెరువు సూరి సహా ముద్దాయి తగరకుంట కొండా రెడ్డి విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. జీవిత ఖైదు శిక్ష పడిన వారికి 18 ఏళ్ల తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.